కాలభైరవ జయంతి
- మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజు కాలభైరవస్వామి జయంతి.దీనినే కాలభైరావాష్టమి అని అంటారు.
- శివుని విశేష అవతారమే కాలభైరవుడు కాబట్టి, ఈశ్వరుణ్ణి పూజిస్తే కాలభైరవుణ్ణి పూజించినట్టే.
- కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి రోజు మాత్రం ఈ పేరుతోనే స్వామిని పూజించడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది.
- కాలభైరవ జయంతి మంగళవారం,లేదా ఆదివారం రావడం విశేషంగా చెబుతారు.
- శివమహా, స్కాంద పురాణాలలో ప్రధానంగా బ్రహ్మదేవుని గర్వాన్ని అణచడానికే శివుని అవతారంగా ‘భైరవ జననం’జరిగినట్లు ఉంది.
- బ్రహ్మను ‘చతుర్భుజుడు’ అంటారు. కానీ, అంతకంటే ముందు ఆయనకు అయిదు తలలుండేవి. తానే శ్రీ మహావిష్ణువు కన్నా కూడా గొప్పవాడినని బ్రహ్మ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. పైగా శివుణ్ణి నిందిస్తాడు.
- శివుని కొనగోటిలోంచి పుట్టిన శక్తి ‘కాలభైరవుని’గా ఆవిర్భవిస్తుంది. మహోగ్రరూపంతో అవతరించిన మహాకాల భైరవుని విశ్వరూపం అత్యంత భీకర భయానకం.
- అలా ఉద్భవించిన కాలభైరవుడే బ్రహ్మదేవుని అయిదు తలల్లోంచి ఒక దానిని ఖండిస్తాడు. జ్ఞానోదయమైన బ్రహ్మదేవుడు నాటినుంచీ నాలుగు తలలతోనే కొనసాగుతాడు.
- ఆ కాలభైరవుడే శివాజ్ఞతో విశ్వసంరక్షకుడుగా ఉన్నాడన్నది శాస్త్రీయ కథనం.
- కాలభైరవుడు అవతరించిన ఆ రోజునే భైరవాష్టమి లేదా కాలాష్టమిగా ప్రజలు జరుపుకొంటున్నారు.
- ‘ఖండితమైన బ్రహ్మ కపాలాన్ని పట్టుకొని భైరవుడు వివిధ ప్రాంతాలు తిరుగుతుండగా, అది ఎక్కడైతే పడుతుందో అక్కడ తనకు పాపప్రక్షాళన కాగలదు.’ చివరకు అది కాశీనగరంలో పడుతుంది.
- దీనివల్లే ఈ నగరానికి ‘బ్రహ్మకపాలం’ అని పేరు వచ్చిందని పౌరాణికుల కథనం. బ్రహ్మహత్యా పాపాన్ని సైతం తొలగించేంత శక్తి ఈ పవిత్రనగరానికి ఇలా సంప్రాప్తించింది.
- అనేక శివాలయాల లోపలే భైరవ దేవాలయాలు ఉంటాయి.
- ప్రత్యేకించి చాలావరకు జ్యోతిర్లింగాలయాలలో తప్పనిసరిగా భైరవ విగ్రహాలు ఉంటాయి. వారణాసి (కాశి)లోని కాశీ విశ్వనాథ్ ఆలయం, ఉజ్జయిని (మధ్యప్రదేశ్)లోని కాలభైరవ దేవాలయం వాటిలో ప్రముఖమైనవి. ఉజ్జయినిలోనే పాతాళభైరవ, విక్రాంత్ భైరవ దేవాలయాలు ప్రసిద్ధినొందాయి.
- పంజాబ్‌లోని సాంగ్రూర్ జిల్లాకు చెందిన ధూరీ నగరంలోనూ ఒక ప్రాచీన కాలభైరవ ఆలయం ఉన్నది. ఇక్కడి కాలభైరవుని విగ్రహం కొన్ని వందల సంవత్సరాల కిందటిదిగా చెప్తారు.
- శివరాత్రి పండుగ నాడు భైరవపూజ చేయడం గోరట్ కశ్మీరీల సంప్రదాయం. ఆదిశంకరాచార్యుల వారు కాశీ నగరంలోనే ‘శ్రీ కాలభైరవాష్టకం’ స్తోత్రరచన చేశారు.
- మహారాష్ట్రలోని గ్రామాలలో కాలభైరవుణ్ణి గ్రామదేవునిగా పూజిస్తారు. అక్కడ భైరవ/భైరవనాథ్, భైరవార్‌గా వ్యవహరిస్తారు.
- మధ్యప్రదేశ్‌లోని ‘శ్రీకాలభైరవనాథ్ స్వామి’ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది.
- దక్షిణ కర్నాటకలోని శ్రీఆదిచుంచనగిరి కొండలలోని ఆలయంలో శ్రీకాలభైరవేశ్వరుడు వెలసి, అక్కడ క్షేత్రపాలకుడుగా పూజలు అందుకొంటున్నాడు.
- ప్రధానంగా, శునకం (కుక్క) భైరవుని వాహనం కావడం వల్ల ప్రతీ శునకాన్నీ హైందవులు అదే ఆరాధనాభావనతో చూడడం విశేషం.
- భైరవుడు కొలువైన శివాలయాలలో విగ్రహం సాధారణంగా దక్షిణాభిముఖంగా, ఉత్తరం వైపున ఉంటుంది.
- ప్రతీ ఆలయంలోనూ భైరవుడే ‘క్షేత్రపాలకుడు’. నిల్చొన్న భంగిమలో నాలుగు చేతులతో ఆయన దర్శనమిస్తాడు. ఇంకొన్ని రూపాలు నాలుగుకు మించిన చేతులేకాక తన వాహనమైన శునకంతో, దిగంబరంగానూ ఉంటాయి. ఇవన్నీ అత్యంత భయంకరమైనవి.
సాధారణంగా అన్ని శివాలయాలలో నిత్యపూజలు సూర్యాది నవగ్రహాల ఆరాధనతో మొదలై భైరవుని పూజతో ముగుస్తాయి. నెయ్యితో స్నానం, ఎరుపు పూలు, నేతి దీపం, విడగొట్టని కొబ్బరికాయ, తేనె, ఉడికించిన ఆహారం, పీచుతో కూడిన పండ్లు భైరవదేవునికి ప్రీతికరం . భైరవుని ఆరాధనకు అర్ధరాత్రి అసలైన సమయమని, ఆ వేళ తాను తన దేవేరి (భైరవి)తోకూడి భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. శుక్రవారం అర్ధరాత్రి ఇది సంభవిస్తుందని, అర్చనలో 8 రకాల పూలు వినియోగించాలని చెప్తారు. మంగళవారం పూట కూడా భైరవపూజ అత్యంత ఫలప్రదమనీ అంటారు.
2022 : డిసెంబర్ 01.
Comments
Post a Comment