శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - మాలకొండ
నెల్లూరు జిల్లా వలేటివారి పాలెం మండలంలో ఉన్న మాలకొండ పై లక్ష్మి నరసింహ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం నవ నరసింహ ఆలయాలలో ఒక్కటి.
సాధారణంగా అన్ని ఆలయాలు ఉదయం సాయంత్రం భక్తులకు దర్శనం కల్పిస్తే ఈ ఆలయంలో మాత్రం స్వామి వారి దర్శనం కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే కలుగుతుంది.
స్వామివారి దర్శనార్థం కొండపైకి చేరుకునేందుకు మెట్లమార్గం ఉంది..వాహనాలు వెళ్లే ఏర్పాట్లు కూడా ఉన్నాయి.వారంలో ఒక్కరోజే ఆలయం తెరిచి ఉండడంతో ప్రతిశనివారం వేలాది భక్తులతో ఆలయం కళకళలాడుతుంటుంది.
ఇక్కడ చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో మూడు శనివారాలు ఆవు నెయ్యతో దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తితో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం.
ఇక్కడ ఏడు ఋషుల పేరుతో ఏడు తీర్థాలు ఉన్నాయి. వీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అని విశ్వసిస్తారు.
అవి నృసింహ తీర్థం, వరుణ తీర్థం, కపిల తీర్థం, అగస్త్య తీర్థం, శంకర తీర్థం, జ్యోతి తీర్థం, ఇంద్ర తీర్థం.
జ్యేష్ట మాసంలో స్వామివారికి ముఖ్యమైన పూజలు చేస్తారు.
పురాణగాథ
పురాణాల ప్రకారం విష్ణుమూర్తిని భూలోకంలో ఈ ప్రాంతంలో కొలువై భక్తులను దర్శనం ఇవ్వాలని లక్ష్మీదేవి కోరిందట. ఆమె కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడ మాల్యాద్రి నరసింహుడిగా వెలిశాడని అంటారు. అగస్త్య మహాముని తాను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలం మాల్యాద్రి కొండ అని భావించి ఈ కొండపైకి వచ్చి తపస్సు చేశాడని కూడా కథనం. అగస్త్యుడి కోరిక మేరకు కలికాలంలో ప్రజల పాపాలు పటాపంచలు చేసి వారిని రక్షించేందుకు స్వామి ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారని అంటారు. మునులు, దేవతలు, యక్షులు, కిన్నెర, కింపురుషాదులకు ప్రతి రోజు స్వామివారి దర్శనమిస్తారట. వారంలో ఒకరోజు, కేవలం శనివారం మాత్రమే మిగతా వారికి దర్శనమిస్తారట. ఈ కొండపై వెలసిన స్వామి వారి దర్శనం చేసుకుంటే వారి పాపాలు తొలగిపోయి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయ వేళలు
ప్రతి శనివారం ఉదయం 04.00 నుండి సాయంత్రం 05.30 వరకు
నెల్లూరు నుండి 130 కి.మీ
ఒంగోలు నుండి 80 కి.మీ
చూటుప్రక్కల దర్శించవలసిన ఆలయాలు
శ్రీ వెంగమాంబ పేరంటాల ఆలయం నర్రవాడ - 47 కి.మీ
భైరవకోన - 67 కి.మీ
సింగరాయకొండ ఆలయాలు - 48 కి.మీ
Comments
Post a Comment