పంచబేరాలు - తిరుమల
ఆనందనిలయంలో కొలువై, పంచబేరాలుగా పేర్గాంచిన శ్రీనివాసుని ఇదు దివ్యమంగళ స్వరూపాలు ఈ విధంగా పిలువ బడుతాయి.
ధ్రువబేరం
పదడుగుల ఎత్తైన, అతిసుందర మనోహర రూపం కలిగిన, అందరికీ తెలిసిన తిరుమల మూలవిరాట్ స్వయంభు శ్రీనివాసుడు. ఈ విగ్రహం యోగ, భోగ, విరహ రూపాల్లో కాక వీరస్థానక విధానంలో ఉంటుంది. స్థిరమై ఉన్న విగ్రహం కావున ఉత్సవాల్లో సంచార లక్షణం కలిగిన మిగతా నాలుగు బేరాలను చూడవచ్చు.
మూలవిరాట్ కళ్ళను నామం దాదాపు పూర్తిగా కప్పేసి ఉంటుంది. ఇదివరకు రెండుసార్లు ఆ నామం పరిమాణం తగ్గించగా, రెండు సార్లూ ఆలయంలో గొడవలు, రక్తపాతం జరిగినట్టు చరిత్ర.
శంఖచక్రాలు స్వయంభు విగ్రహంలో భాగం కానందున శంఖచక్ర ఆభరణాలు అమర్చి ఉంటాయి.
కౌతుకబేరం
ఆగమ శాస్త్రానుసారం ప్రతి ధ్రువబేరానికి కౌతుకబేరం ఉంటుంది. తిరుమల గర్భాలయంలోని కౌతుకబేరం భోగ శ్రీనివాసుడు. శంఖచక్రాల మినహా ఈ విగ్రహ లక్షణాలు పూర్తిగా ధ్రువబేరంలాగానే ఉంటాయి.
పల్లవ యువరాణి సామవాయి ఈ వెండి విగ్రహాన్ని చేయించి క్రీ.శ.614లో సమర్పించినట్టు శాసనం చెబుతోంది. నిత్యదీపారాధన, నిత్యనైవేద్యం, నిత్యాభిషేకం వంటి సేవలు ఈ కౌతుకబేరానికి జరుగుతాయి.
ఉత్సవబేరం
భక్తులు మలయప్పస్వామి అని ప్రేమగా పిలుచుకునే శ్రీదేవి-భూదేవి సమేత స్వయంభు విగ్రహం ఈ ఉత్సవబేరం. మూడడుగుల ఎత్తున్న ఈ శ్రీనివాసుడే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనమిచ్చేది. తిరుమలలో జరిగే ఉత్సవాల్లో పూజలందుకునే వాడు, ఊరేగింపులకు నాయకుడు మలయప్ప స్వామే.
స్నపనబేరం
గర్భాలయంలోని మరొక చిన్న విగ్రహం ఉగ్ర శ్రీనివాసుడు. ఈ విగ్రహాన్ని స్నపనబేరం అంటారు. పై మూడు బేరాలకు భిన్నంగా ఈ విగ్రహం శ్రీదేవి-భూదేవి సహితమై ఉంటుంది. ఏడంగుళాల పీఠంపై పద్దెనిమిది అంగుళాల విగ్రహం.
14వ శతాబ్దం వరకు ఈ విగ్రహమే ఉత్సవ విగ్రహంగా వ్యవహరించబడేది. బ్రహ్మోత్సవాల్లో ఈ విగ్రహం ఊరేగింపులో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఈయనను ఉగ్రశ్రీనివాసుడిగా గుర్తించి ఏడాదికొకసారి సూర్యోదయానికి ముందే (సూర్యుడి కిరణాలు తాకకూడని విగ్రహం) ఊరేగింపుకు తీసుకెళ్ళి గర్భగుడికి చేరుస్తారు. మూలవిరాట్‌లా ఈ విగ్రహం అతిపురాతనమైనది. ఎప్పుడు ఎవరిచే ప్రతిష్టించబడిందో వివరాలు, శాసనాలు లేవు.
బలిబేరం
గర్భాలయంలోని మరో చిన్న శ్రీనివాసుడి విగ్రహాన్ని కొలువు శ్రీనివాసుడు లేదా బలిబేరం అంటారు. మూలవిరాట్‌కు తోమాలసేవ జరిగాక ఈ బలిబేరం విగ్రహాన్ని ఆస్థానమంటపంలోకి తీసుకువచ్చి, అక్కడ పంచాంగశ్రవణం, రేషన్ పంపిణీ ఏర్పాట్లు చేస్తారు. హుండీ బహుమానాలను కూడా ఈ శ్రీనివాసుడికే లెక్కచెప్పి అప్పజెబుతారు. ఈ శ్రీనివాసుడు ఇంతదాకా ఆలయాన్ని దాటి వెళ్ళిన ఆధారాలు లేవు, ఎప్పుడు ఎవరిచే ప్రతిష్టించబడిందో వివరాలు, శాసనాలు లేవు.
Comments
Post a Comment