ఏకాదశి ఉపవాసం వెనుకున్న ఆంతర్యం

 


ఏకాదశి రోజు చేసే ఉపవాసం వెనుకున్న ఆంతర్యం తెలుసుకుందాం 


ఆషాఢమాసం నుంచి  పుష్యమాసం వరకూ వచ్చే ఏకాదశిల్లో...ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది.

చాతుర్మాస దీక్ష ప్రారంభించే వారు ఆషాఢ ఏకాదశి నుంచి మొదలెడతారు. అదే తొలి ఏకాదశి.

శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదైకాదశి అంటారు. అంటే సంతానంకోసం వ్రతం చేసేవారు ఈ ఏకాదశి నుంచి మొదలు పెట్టి  ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేస్తారు.

భాద్రపద శుద్ధ ఏకాదశి దీనిని పరివర్తనేకాదశి అంటారు. ఈ ఏకాదశిరోజు విష్ణువు ఎడమనుంచి కుడివైపుకు తిరిగి పడుకుంటాడని అంటారు

ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి పాశాంకుశైకాదశి అంటారు. ఈ వ్రతం చేసినవారికి నరకప్రాప్తి లేకుండా ఉంటుందని చెబుతారు.

కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన ఏకాదశి అంటారు

పుష్యమాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ రోజున ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. అత్యంత పవిత్రమైన రోజుగా భావించి ఉపవాసాలు, జాగరణలు చేస్తారు


ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉందన్న విషయం అర్థమైతే..చేసే పూజల్లో, నోచే నోముల్లో చాదస్తం కనిపించదేమో. ఇక ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. ఏకాదశి తిధి రోజు చంద్రుడు,సూర్యుడు,భూమి మధ్య ఉండే దూరం,సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని అందుకే ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చెబుతారు. సాధారణంగా మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. కొంత భాగం మిగిలిపోతుంది. అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది. ప్రతి ఏకాదశికి అంటే 11 రోజులకోసారి ఉపవాసం ఉండడం వల్ల వ్యర్థ్యాలు బయటకు పోయి శరీరం శుభ్రపడుతుంది. భక్తి కి భక్తి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట


దేహమే దేవాలయమని శాస్త్రం చెబుతుంది.  మన మనసులోనే ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే...ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం లాంటి సాధనల ద్వారా ఆరాధించడమని అర్థం . పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ,  మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుడిని జయించి.. జ్ఞానాన్ని,ముక్తిని పొందాలంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉపవాసం ద్వారా.... మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే

No comments