Venugopala Temple: శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం - బొబ్బిలి

 ఉత్తరాంధ్రలో  తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన  ఆలయం బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామి.



బొబ్బిలి రాజవంశీకుల కులదైవం శ్రీ వేణుగోపాలస్వామి. బొబ్బిలి కోట సమీపంలో ఉన్న ఈ ఆలయంలో రుక్మిణీ, సత్యభామా సమేతుడిగా వేణుగోపాలుడు దర్శనమిస్తాడు. బొబ్బలి సంస్థానాధిపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు. సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందినది. దేవాలయ గోపురం, ప్రధాన ఆలయం కంటే ఎత్తులో ఉండే ఏకైక ఆలయం ఇది.  ఆలయ గోపురం సుమారు 9 మీటర్ల ఎత్తు ఉంటుంది.


ఈ వేణుగోవాలస్వామి ఆలయంలో ఐదు అంతస్తుల గాలిగోపురం ప్రత్యేక ఆకర్షణ.  తూర్పు ముఖంగా గర్భాలయం, అంతరాలయం, మండపం అనే మూడు భాగాలుగా, రెండు ప్రాకారాలను కలిగి ఉంది. ఆలయ గాలిగోపురం తూర్పువైపు అభిముఖంగా ఉండి, దాని కింది నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయం ప్రవేశ ద్వారం బయట కళ్యాణమండపం ఒకటి ఉంది. మొదటి ప్రకారంలో ధ్వజస్తంభం, గరుడాళ్వారు మండపం, రెండవ ప్రకారంలో ముఖమండపం, ఆరాధన మండపం, అంతరాలయం, గర్భాలయం ఉన్నాయి.


గర్భాలయంలో రుక్మిణి-సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు కొలువై ఉండగా..గర్భాలయం బయట శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక మందిరం ఉంది. గర్భాలయానికి వాయువ్వంలో ఆండాళ్, నైరుతి లో శ్రీరామ క్రత: స్థంభం ఉన్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న మండపంలో శ్రీ ఆంజనేయస్వామి, ఆళ్వార్లు, శ్రీ సీతారాములు, శ్రీ రామానుజులవారు, శ్రీ రాధాకృష్ణుల విగ్రహాలున్నాయి. ఏటా వసంతోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. అలాగే మాఘశుద్ద ఏకాదశికి స్వామివారికి కల్యాణోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇంకా ధనుర్మాసం, శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతాయి. ధనుర్మాసంలో జరిగే పూలంగిసేవ చూడడం  అదృష్టంగా భావిస్తారు.  ఆలయానికి కొంత దూరంలో నారాయణ పుష్కరిణిలో తెప్పోత్సవం  వైభవంగా జరుగుతుంది. 


విజయనగరానికి దాదాపు 60 కిలోమీటర్లదూరంలో వుంది ఈ ఆలయం.

No comments