నాగోబా జాతర 2023
మన సంప్రదాయంలో సర్పారాధన పురాతనమైనది. దీంతో ముడి పడిఉన్న వేడుకే నాగోబా జాతర. గిరిపుత్రులైన గోండులు ఈ జాతరను నిర్వహించుకుంటారు. ఆదిలాబాదు జిల్లాలోని కేస్లాపూర్ గ్రామంలో జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఆదివాసీల ఐక్యతకు నిదర్శనం ఈ సంబరం. పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి పూజలు నిర్వహించటం ఆనవాయితీ. జాతర మూడురోజుల పాటు జరుగుతుంది. పుష్య అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా ( ఆదిశేషుడు ) పురివిప్పి నాట్యమాడుతాడని గోండుల నమ్మకం.
జాతర ప్రారంభానికి ముందు గోండు తెగకు చెందిన మేస్రం వంశీయులు నాగోబా పూజకు కావలిసిన కొత్త కుండలను ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిళ్ళ వంశీయులు నుంచి తెచ్చుకుంటారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, వాటిపై కప్పి పెట్టేందుకు పాత్రలు, నీటి కుండలు ఇలా మొత్తం 130 కి పైగా కుండలను తయారు చేయించుకుంటారు. జాతరలకు గంగాజలాన్ని (గోదావరి నీటిని) ఈ కుండల్లోనే తీసుకొస్తారు. దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఈ కుండల్లోనే వండుతారు. ఈ కుండలకు సిరికొండ కుండలు అని పేరు.
సిరికొండ కుండలను సేకరించుకున్న తరువాత మెస్రం వంశీయులు, కటోడా, ప్రధాన్‌లు కలిసి ఎడ్ల బండ్లపై ఏడు రోజుల పాటు పర్యటించి మేస్రం వంశీయులున్న ఏడు గ్రామాలను సందర్శిస్తారు. జాతర నిర్వహణపై ప్రచారం చేస్తారు.
పుష్య పౌర్ణమినాడు 20 మంది మేస్రం వంశీయులు సిరికొండ కుండలతో గోదావరి జలాన్ని తేవడానికి బయలు దేరుతారు. దీంతో జాతర ప్రారంభమౌతుంది. గోదావరి జల సేకరణ కోసం కేస్లాపూర్ నుంచి గోదావరి వరకు దాదాపు 80 కిలో మీటర్లు నడిచి వెళతారు. ఇలా తెచ్చిన నీటితో కేస్లాపూర్‌లోని నాగోబాకు అభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత పాలతో అభిషేకించి పూజలు నిర్వహించడం ఆచారం.
గోదావరి జలంతో నాగోబా ఆలయాన్ని, విగ్రహాన్ని శుద్ధి చేసి, పూజ నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు తెస్తారు. ఒక రాగి చెంబులో నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటినీ పోసి ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్టమీది రుమాలు పైకెత్తినట్లు కనిపిస్తే పూజా కార్యక్రమాన్నిఆరంభిస్తారు .జాతరకు వచ్చే గోండులైన మేస్రం వంశీయులు ఎంత మంది ఉన్నా వారందరూ వంటలు కేవలం 22 పొయ్యిల మీదే చేసుకుంటారు. వీటిని సైతం ఎక్కడపడితే అక్కడ పెట్టరు. వీటికి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాట్లుంటాయి. ప్రహరీ గోడలో ప్రతేక అరల్లో ఉన్న దీపాల కాంతుల వెలుగులో మేస్రం వంశీయుల వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగిలిన గోత్రాల వంశీయులు వంటలు ఎక్కడైనా చేసుకోవచ్చు.
జాతర సందర్భంగా ప్రత్యేకంగా దర్బార్ నిర్వహించడం పరిపాటి. ఇందులో గిరిజనుల సమస్యలను పరిష్కరించుకుంటారు. దర్బార్ అనంతరం ఆదివాసీల బేతాల్ పూజ నిర్వహిస్తారు. కుల పెద్దలు కర్రసామును పోలిన బేతాల్ నృత్యాలు చేస్తారు. అనంతరం మండగాజిలింగ్ పూజలతో నాగోబా జాతర ముగుస్తుంది.
ఎలా వెళ్ళాలి?: ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో ముత్నూరు ఉంది. అక్కడికి నాగోబా ఆలయం 4 కి.మీ. దూరంలో ఉంటుంది.
Comments
Post a Comment