శ్రీ వరలక్ష్మి వ్రతకథ
ఒకనాడు పార్వతీదేవి శంకరున్ని చూసి మహేశ్వరా సర్వసౌభాగ్యాలు, సిరిసంపదలు కలగాలంటే ఎలాంటి ప్రతాన్ని చేయాలో వివరించమని అడుగగా దానికి సమాధానంగా శంకరుడు వరలక్ష్మీ వ్రతాన్ని వివరించిన విషయాన్ని భవిష్యోత్తర పురాణం మనకు అందిస్తోంది.
మగధదేశంలోని కుండినం అనే నగరం సిరిసంపదలకు పెట్టిందిపేరు. అటువంటి నగరంలో చారుమతి అనే మహిళ నివసిస్తుండేది. ఆమె సకలగుణ సంపన్నురాలు. ఈమెపై లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా ఉన్నది. ఒకనాడు చారుమతికి కలలో లక్ష్మీదేవి కనిపించి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించమనిచెప్పి దాని నియమాలన్నీ ఉపదేశించింది. చారుమతి కలలోనే లక్ష్మీదేవిని పూజించి నమస్కరించగా దేవి అదృశ్యమైంది. తెల్లవారి చారుమతి తనకు వచ్చిన కలగురించి ఇరుగుపొరుగు వారికిచెప్పి అందరితో కలిసి వ్రతాన్ని భక్తితో ఆచరించింది. తొమ్మిది పోగులదారాన్ని పూజించి చేతికి ధరించింది. అనంతరం అందరూ కలిసి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. ఒకటో ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరి కాళ్ళకు ఘల్లుమనే శబ్దం వినిపించింది. ఆశ్చర్యంతో చూడగా కాళ్ళకు గజ్జెలు ప్రత్యక్షమయ్యాయి. ఆనందంతో వారంతా అలా మూడు ప్రదక్షిణలు చేయగానే ఏడువారాల నగలు వారి శరీరాలమీద కనిపించాయి.
ఎంతోసంతోషించిన ఆ స్త్రీలు బ్రాహ్మణులను, వేదపండితులను పూజించి వారి ఆశీస్సులను తీసుకున్నారు. ముత్తైదువలకు పసుసుకుంకుమ పండ్లతో కూడిన తాంబూలాలు వాయనంగా ఇచ్చి వారి ఇండ్లకు వెళ్ళారు. ఆతరువాత చారుమతితో పాటుగా నగరంలోని
స్త్రీలంతా ప్రతిసంవత్సరం తప్పకుండా ఈవ్రతాన్ని ఆచరిస్తు దేవి అనుగ్రహాన్ని పొందారు. తనకు మాత్రమే సంపద దక్కాలనే స్వార్థబుద్ధి లేకుండా పరోపకార దృష్టితో చారుమతి ఏవిధంగా ఉత్తమమైన ఈవ్రతాన్ని ఆచరించిందో అదేవిధంగా అందరూ దీన్ని ఆచరించవచ్చు. ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారికి తప్పకఫలితం ఉంటుంది.
Comments
Post a Comment