2022: ఆగస్టు25 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
టీటీడీ ఆధ్వర్యంలోఆగస్టు 25 నుండి 27వ తేదీ వరకు తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుక గల టీటీడీ మూడో సత్ర ప్రాంగణంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది.
ఈ మూడు రోజుల పాటు ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు చేపడతారు. ఉదయం 8.30 గంటల నుండి 12.30 గంటల వరకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భజన మండళ్ళతో సంకీర్తనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు ధార్మిక సందేశాలు, మహనీయులు మానవాళికి అందించిన ఉపదేశాలు తెలియజేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
ఆగస్టు25న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశం ఇవ్వనున్నారు.ఆగస్టు 27వ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.
గతంలో ఎందరో మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని కాలినడక అధిరోహించి స్వామి వారి అనుగ్రహం పొందారు .
Comments
Post a Comment