వైశాఖ మాసం 2021
చాంద్రమానంలో రెండవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు విశాఖ నక్షత్రం వుండటం చేత ఇది వైశాఖంగా పిలవబడుతోంది. కార్తీక,మాఘ మాసాలవలె ఈ మాసం ఎంతో పుణ్యప్రదమైనది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం, అందుకే మాధవ మాసం అని కూడా అంటారు. పుణ్యస్నానం, విష్ణుపూజ, దానధర్మాలు ఈ మాసంలోని ముఖ్య విధులని పద్మపురాణం చెబుతోంది. ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేయడం, నక్తం అంటే పగలు ఉపవాసం ఉంది రాత్రి భోజనం చేయడం, అయాచితం అంటే ఆ సమయంలో దొరికిన దాని ఆహారంగా స్వీకరించడం వల్ల కోరికలు నెరవేరుతాయి. ఈ మాసంలో పుణ్యస్నానాలు చేయడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పాపాలు హరింపబడుతాయి. ఈ మాస విధులలో సముద్ర స్నానం కూడా చెప్పబడింది. వైశాఖ పూర్ణిమ లేదా అమావాస్య రోజులలోనే ఈ సముద్ర స్నానాని ఆచరించాలి. ఒక వేళ ఆ రోజులలో మంగళ లేదా శుక్రవారాలు వస్తే సముద్ర స్నానం చేయకూడదు. ఈ మాసంలో ఆచరించే సముద్ర స్నానం వల్ల కురుక్షేత్రంలో వేయి గోవులను, భూమిని దానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ మాస విధులలో విష్ణుపూజ మరో ముఖ్యంశం. తులసి దళాలతో స్వామిని అర్చించడం ఎంతో ముఖ్యం. ఈ మాసంలో రావిచెట్టుతో పాటు, తులసి పూజ చేయడం కూడా సంప్రదాయంగా వస్తుంది. ...